Koti Deepotsavam 2023: కార్తీక మాసంలో వెలిగే ప్రతి ప్రమిద మంగళప్రదం అంటారు.. అదే ఒకే చోట.. ఓ వెలుగుల ఉత్సవం జరిగితే.. వేలాది మంది ఒకేచోట చేరి దీపాలు వెలిగిస్తే.. అది ‘కోటి దీపోత్సవం’ అవుతుంది.. అదే ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే కోటి దీపోత్సవం. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రతీ ఏడాది ఈ ఉత్సవం జరుగుతోంది.. ఈ ఉత్సవాలు జరిగినంత కాలం.. సంధ్యా సమయంలో.. ఓ కాంతివనంలా వెలిగిపోతాయి ఎన్టీఆర్‌ స్టేడియం, పరిసర ప్రాంతాలు.. ఇక్కడ భక్తజనులు వెలిగించే ప్రతి దివ్వె మహాదేవుని కాలిమువ్వు అవుతుంది.

ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణాలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ఈ వేదికగా మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారవశ్యంలో ముంచేస్తాయి.

నవంబర్‌ 14న ప్రారంభమై కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. నవంబర్‌ 27వరకు జరగనున్న ఈ దీపోత్సవంలో వేదికనెక్కే వేద పండితులు, అతిథులుగా హాజరయ్యే అతిరథమహారథులు, ప్రతిరోజూ వేలు, లక్షలుగా భక్త జనం పాల్గొంటున్నారు. లక్ష దీపాల అంకురార్పణతో ప్రారంభమైన ఈ మహాదీపయజ్జం.. కోటిదీపోత్సవంగా మారింది.. క్రమంగా ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది నిరాటంకంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్‌ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది..

తొలి రోజు ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి.. శ్రీశైలం మల్లన్న కల్యాణాన్ని చూసి తరించారు భక్తులు.. తొలి రోజే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోతవ్సం వేదిక జనసంద్రంగా మారిపోయింది. 2వ రోజు కాణిపాకం వినాయక స్వామి కల్యాణం, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం.. కాజీపేట శ్వేతార్క మూలగణపతికి సప్తవర్ణ అభిషేకం,కోటి గరికార్చన.. మూషికవాహనంపై గణపతి ఉత్సవమూర్తుల ఊరేగింపు, మయూరవాహనంపై మోపిదేవి ఉత్సవమూర్తుల ఊరేగింపు ఇలా కన్నుల పండుగగా సాగింది..

ఇక, మూడో రోజు సకలదోషాలను హరించే అలంపురం జోగులాంబ కల్యాణం కన్నులపండువగా జరిగింది. విశేష కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఇలా ఎన్నో కార్యక్రమాలకు వేదిక భక్తి టీవీ కోటిదీపోత్సవం.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో పాల్గొనండి.. తరలి రండి.. దీపయజ్ఞంలో పాత్రులు కండి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *