నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్ – శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్, సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి, మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్, నిర్మాణం – విజువల్ రొమాన్స్, దర్శకత్వం – బ్లెస్సీ

కథేంటంటే

కేరళకు చెందిన యువకుడు నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను(అమలాపాల్) తో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. మంచి ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్దామని తన స్నేహితుడు హకీం ఇచ్చిన సలహాతో అతనితో పాటు వెళ్లేందుకు రెడీ అవుతాడు. ఏజెంట్ చేసిన మోసంతో నజీబ్ కు అనుకున్న ఉద్యోగం దక్కదు. అక్కడి యజమాని నజీబ్ కు శిక్షగా గొర్రెల్ని కాసేందుకు ఎడారిలో వదిలేస్తాడు. ఆ ఎడారిలో అష్టకష్టాలు పడతాడు నజీబ్. భార్య గుర్తొచ్చి బాధపడుతుంటాడు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి నజీబ్ ఎలా తప్పించుకున్నాడు. కేరళకు ఎలా తిరిగొచ్చాడు అనేది మిగిలిన కథ

ఎలా ఉందంటే

నజీబ్ అనే యువకుడి జీవితంలో నిజంగా జరిగిన కథ ఇది. అతని జీవితాన్ని ఆటోబయోగ్రఫీ గా గోట్ డేస్ పేరుతో రాశారు బెన్యామిన్ అనే రైటర్. ఈ నవల కేరళలో అనూహ్య ఆదరణ పొందింది. ఇదే నవల ఆధారంగా ది గోట్ లైఫ్ పేరుతో సినిమాగా రూపొందించారు దర్శక నిర్మాత బ్లెస్సీ. కేరళలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన ఫ్యామిలీతో హాయిగా ఉన్న నజీబ్. కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటే మంచి ఉద్యోగం చేయాలని దుబాయ్ వెళ్లాలనుకుంటాడు. అక్కడ మోసపోయి శిక్షగా గొర్రెలను కాసేందుకు ఎడారిలోకి పంపబడతాడు. ఈ రెండు సందర్భాలను పోల్చుతూ సినిమా పస్టాఫ్ ను తెరకెక్కించారు దర్శకుడు. కేరళలో అందమైన ప్రకృతి మధ్య కావాల్సినంత నీరున్న ప్రాంతంలో నివసించిన నజీబ్, ఎడారిలో నీటి జాడే తెలియని ప్రాంతంలో గొర్రెలు కాస్తున్నప్పుడు అతని మానసిక వ్యధను దర్శకుడు ఎంతో సహజంగా చిత్రీకరించాడు.

ద్వితీయార్థంలో అతను దుర్భరమైన ఈ ఏడారి నుంచి తనను తాను బతికించుకునేందుకు చేసిన సాహసాలే కనిపిస్తాయి. కథ సింగిల్ లైన్ లో ఉన్నా…కథనాన్ని ఆద్యంతం ఆసక్తకిరంగా నడిపించాడు దర్శకుడు. ఎడారిలో పాములు, రాబందులు, ఇసుక తుఫానులు వంటి ఎన్నో ప్రమాదాల బారి నుంచి తప్పించుకుంటూ ప్రయాణం సాగిస్తాడు కథానాయకుడు. అతనికి తోడుగా ఉండే ఇబ్రహీం పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుంది. ఈ పాత్రను హాలీవుడ్ నటుడు జీన్ లూయిస్ పోషించాడు. నజీబ్ ఎడారి జీవితాన్ని అత్యంత సహజంగా ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా తెరకెక్కించాడు దర్శకుడు బ్లెస్సీ.

నజీబ్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించలేదు జీవించాడు అని చెప్పాలి. ఆ పాత్ర ప్రయాణంలో వివిధ సందర్భాలకు తగినట్లుగా మారిపోయాడు. బరువు పూర్తిగా తగ్గి చిక్కిపోయి, పీలికలతో కనిపించే పాత్రలో పృథ్వీరాజ్ ను ఎక్కడా ఊహించుకోలేము. నజీబ్ ఎడారిలో పడుతున్న ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తాయి. పృథ్వీరాజ్ కెరీర్ లో పర్ ఫార్మెన్స్ పరంగా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా ఇది. అతని భార్యగా అమలాపాల్ నటన ఆకట్టుకుంటుంది. ఇబ్రహీం క్యారెక్టర్ లో జీన్ లూయిస్, పృథ్వీరాజ్ స్నేహితుడిగా కేఆర్ గోకుల్ నటన ఆ పాత్రలకు తగినట్లుగా సహజంగా ఉంది.

టెక్నికల్ గా చూస్తే సునీల్ కేఎస్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఒక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఎడారి జీవితాన్ని తన కెమెరాలో కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్. మ్యూజిక్ పరంగా ఏఆర్ రెహమాన్ ఈ కథకు లైఫ్ ఇచ్చాడు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ను ఎలివేట్ చేశాయి. ఒక కొత్త సినిమాటిక్ అనుభూతి కోసం ది గోట్ లైఫ్ చూసేయొచ్చు.

రేటింగ్ 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *