హైదరాబాద్ లో మునుపెన్నడూ జరగని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఇళయ రాజా కాన్సర్ట్ పై భారీ అంచనాల మధ్య నిర్వాహకులు ‘హైదరాబాద్ టాకీస్’ వ్యవస్థాపకులు ఈ రోజు పరిశ్రమలు, సమాచార సాంకేతిక(ఐటీ) శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి కార్యక్రమానికి వారిని సాదరంగా ఆహ్వానించారు. స్వర జ్ఞాని గౌరవార్ధం జరగనున్న ఈ భారీ కార్యక్రమంలో కచ్చితంగా భాగమవుతామని వారు కూడా తెలిపారు.

అదే ఉత్సాహంతో అగ్ర సినీ తారలైన శ్రీ కొణిదెల చిరంజీవి గారిని, శ్రీ అక్కినేని నాగార్జున గారిని కలిసి ఇళయరాజా గారి పాటలతో ఆయన గౌరవార్ధం ముందు రోజు చేయనున్న కాన్సర్ట్ లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించగా…

“ఇళయరాజా గారు సినీ సంగీత ప్రపంచానికి చేసిన సేవని గుర్తు చేసుకుంటూ ఈ భారీ వేదిక పై గౌరవంగా ఆయనని సత్కరించుకోవడం మనకి అవసరం. ఇన్నేళ్ల ఆయనతో వేదిక పంచుకోనున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నటించిన ఎన్నో చిత్రాలకి ఆయన సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం.” అని చిరంజీవి గారు అన్నారు.

“శ్రీ ఇళయరాజా గారి సంగీతం అందించిన ఎన్నో సూపర్ హిట్ పాటలు నా చిత్రాల్లోనివే అవ్వడం నా అదృష్టం. గీతాంజలి పాటలు ఆయన అందించిన అద్భుతమైన సంగీతం వల్లే ఇప్పటికీ ఇష్టపడుతున్నారనటంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వేదిక పంచుకోనుండడం నాకు చాలా సంతోషంగా ఉంది.” అని నాగార్జున అన్నారు.

ఇళయరాజా కాన్సర్ట్ కి ముందు రోజు ఫిబ్రవరి 25 న ఆయన గౌరవార్ధం జరగనున్న కార్యక్రమంలో అనూప్ రూబెన్స్, విశాల్ చంద్రశేఖర్, హైదరాబాద్ కి చెందిన పాపులర్ బ్యాండ్లు, గాయకులూ పాల్గొననున్నారు. ఇళయరాజా సంగీత ప్రస్థానాన్ని ఆయన స్వర మేధస్సుని గుర్తుచేసుకుంటూ ఆద్యంతం సంగీత ప్రపంచంలో విహరించేలా చేయనున్నారు.

26 న గచ్చిబౌలి స్టేడియం లో జరిగే కాన్సర్ట్ లో వేదికపై 80 మంది సంగీత కళాకారులతో మ్యాస్ట్రో ఇళయరాజా 20000 మంది వీక్షకులని తన సంగీతం తో ఉర్రూతలూగించనున్నారు.

“చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎంతో మంది ఇళయరాజా అభిమానులకి మా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరగనున్న ఈ భారీ కాన్సర్ట్ కన్నుల పండుగగా నిలవనుంది. శరవేగంగా అమ్ముడయిపోయిన వేల టికెట్లు ఈ కార్యక్రమం పై ఉన్న అంచనాలకి నిదర్శనం” అన్నారు హైదరాబాద్ టాకీస్ వ్యవస్థాపకులు మల్కాపురం సాయినాథ్ గౌడ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *