sasanasabha Review And RatingReview And Rating :

నటీనటులు : ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్, సోనియా అగర్వాల్, అనీష్ కురువిల్లా, రాజేంద్రప్రసాద్ తదితరులు
బ్యానర్ : స్కాలో ప్రొడక్షన్స్
సంగీతం : రవి బసుర్
రచయిత : రాఘవేంద్రరెడ్డి
నిర్మాతలు : తులసీరామ్ సాప్పని, సణుగం సాప్పని
దర్శకుడు : వేణు మడికంటి
విడుదల తేదీ : 16 డిసెంబర్ 2022

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతలు తులసీరామ్ సాప్పని, సణుగం సాప్పని. స్కాలో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రచయిత రాఘవేంద్రరెడ్డి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ

శ్యామల భరత్(సోనియా అగర్వాల్) ప్రతిపక్ష నాయకురాలు. రామమోహన్ నాయుడు(అనీష్ కురువిల్లా) అధికార పార్టీకి చెందిన నాయకుడు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఒకరి ఎమ్మెల్యేలను మరొకరు కిడ్నాప్ చేసి అధికారం చేపట్టాలని తమ తమ అనుచరులతో కలిసి ప్లాన్స్ వేస్తారు. అయితే వీరి ప్లాన్స్ ను తిరగబడేలా చేసి ఇరు పార్టీల ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి అడవికి తరలిస్తాడు సూర్య(ఇంద్రసేన). ఇలా అడవికి తీసుకెళ్లిన ఎమ్మెల్యేలను సూర్య ఏమి చేశాడు? అసలు సూర్య ఎవరు? ఎందుకు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశాడు? అతని లక్ష్యం ఏమిటి అనేది తెలియాలంటే శాసనసభ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

పొలిటికల్ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలను ఇంతకు ముందు చాలా వచ్చాయి. అయితే అవన్నీ… ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుని… చివరకు పై చేయి సాధించడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కినాయి. అందులో పొలిటికల్ డ్రామా మాత్రమే వుంటుంది. అయితే శాసనసభ ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి రచయిత రాఘవేంద్ర రెడ్డి రాసుకున్న ఈ చిత్రం కథ… కథనాలు నేటి పొలిటీషియన్స్ ఆలోచనల్ని మార్చే విధంగా వుంది. శాసనసభ అనగానే మనకి గుర్తొచ్చేది… ప్రతి పక్షాల ఆరోపణలు… అధికాపక్షాల కౌంటర్లు. ఈ మధ్య శాసనసభలో మరీ హద్దులు దాటిపోయి… పర్సనల్ అటాకింగ్ గా మారిపోయాయి శాసనసభ సమావేశాలు. ఒకరినొకరు వ్యక్తిగత ధూషణలు చేసుకుంటూ… విలువైన సమయాన్ని కాస్త తిట్ల పురాణాలకే పరిమితం అయ్యేలా సాగుతున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వేదిక వుండాల్సిన శాసనసభ సమావేశాలు… ఆరోపణలు… ప్రత్యారోపణలతో ప్రజల ధనాన్ని వేస్ట్ చేసేస్తున్నారనే ఆరపణలు వున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా వుండాల్సిన దేవాలయం లాంటి శాసనసభని బూతుపురాణ కేంద్రాలుగా మార్చేశారు. అందుకే అలాంటి శాసనసభని కేంద్రంగా చేసుకుని రాసుకున్న కథ, కథనాలు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో రాజకీయ నాయకులు చేసే వాగ్ధానాలు… వాటిపై ప్రజలు నమ్మకం పెట్టుకుని గెలిపిస్తే… గెలిచిన తరువాత వాళ్లు ఎలా విస్మరిస్తారు? అలాంటి వారికి సూర్య ఎలాంటి కర్తవ్య బోధన చేశాడు అనే అంశాలు… నేటి రాజయకీయ నాయకులను ఆలోచింపజేస్తాయి. నారాయణస్వామి(రాజేంద్రప్రసాద్)లాంటి నీతి నిజాయతీ వున్న ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకుని… ప్రజాసేవలో ఎలా నిమగ్నమవ్వాలనే దానిని… అలాంటి వారు అసెంబ్లీలో వుంటే.. ఎలా రాణించగలుగుతారు? వారికి ఎదురయ్యే సవాళ్లు లాంటి సున్నిత అంశాలను కూడా బాగా చూపించారు. అలాగే యువత ఎన్నికల్లో పాల్గొంటే… వారికి పొలిటీషియన్స్ నుంచి ఎలాంటి త్రెట్ వుంటుందనేది కూడా చూపించారు. ఓవరాల్ గా శాసనసభ… ఓ మంచి మెసేజ్ ఇస్తుంది.

నటీనటులు :

హీరో ఇంద్రసేన స్టూడెంట్ లీడర్ గా… ఆ తరువాత పొలిటీషియన్స్ ఎదిరించే సూర్య పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఎమ్మెల్యేలకు కర్తవ్య బోధన చేసే విద్యార్థి నాయకునిగా మెప్పించాడు. యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకుంటాడు. రాజకీయ నాయకురాలి పాత్రలో 7జీ ఫేం సోనియా అగర్వాల్ కనిపించి ఆకట్టుకుంటుంది. చాలా కాలం తరువాత ఆమె ఇందులో నటించడం విశేషం. నిజాయతీ గల పొలిటీషియన్ పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మెప్పిస్తాడు. అతని పాత్ర ద్వారా ఓ మంచి మెసేజ్ ఇవ్వడం బాగుంది. హెబ్బా పటేల్ తో చేసిన ఐటెం సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు :

ప్రముఖ జర్నలిస్ట్, పీఆర్వో రాఘవేంద్రరెడ్డి రాసుకున్న కథ, కథనాలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. ఎక్కడా బోరింగ్ లేకుండా కథనాన్ని వేగంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా వుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కేజీఎఫ్ కి నేపథ్యం సంగీతంలో ఓ ప్రత్యేక స్థానం కల్పించిన సంగీత దర్శకుడు రవి బసుర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా వుంది. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *