ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “నచ్చింది గాళ్ ఫ్రెండూ”. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మించారు. గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు (ఈ నెల 11) ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు నిర్మాత అట్లూరి నారాయణరావు. ఆయన మాట్లాడుతూ..

హీరో నారా రోహిత్ నాకు మంచి మిత్రుడు. నిర్మాతగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నప్పుడు ఆయనకు చెబితే ముందు డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఇన్వాల్వ్ అవడం ..బిజినెస్ తెలుకున్నాక ప్రొడ్యూసింగ్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అలా నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమాను కొన్ని ఏరియాలు పంపిణీ చేశాం. తర్వాత శ్రీవిష్ణు హీరోగా నీదీ నాదీ ఒకే కథ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మా సంస్థకు కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రసంశలు అందించింది.

ఉదయ్ శంకర్ నాన్న శ్రీరామ్ గారు మా గురువుగారు. ఉదయ్ నటించిన ఆటగదరా శివా, మిస్ మ్యాచ్, క్షణక్షణం వంటి చిత్రాలు చూశాక…ఆయన హీరోగా మంచి థ్రిల్లర్, హ్యూమర్ సినిమాలు చేయొచ్చు అనిపించింది. చెన్నైలో కొందరు దర్శకులు, రచయితలు చెప్పిన కథలు విన్నా అవి ఆకట్టుకోలేదు. గురుపవన్ తనకు చెప్పిన కథ గురించి ఉదయ్ మాతో డిస్కస్ చేశారు. ఆ కథ మేమూ విన్నాం. బాగా నచ్చడంతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాం.

ఉదయ్ కామెడీ బాగా డీల్ చేయగలడు. అందుకే ఈ చిత్రాన్ని కేవలం థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కాకుండా కామెడీ, రొమాన్స్ చేర్చాం. లవ్ స్టోరి అంటే కేవలం ఒక అబ్బాయి అమ్మాయి వెంట పడటం, బాధ్యత లేకుండా తిరగడం చూపిస్తుంటారు. ఈ సినిమా అలా ఉండదు. మన యువతకూ కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు, దేశం పట్ల ప్రేమ ఉన్నాయని చెబుతున్నాం. అదే ఈ మూవీలో ప్రత్యేకత.

ఉదయ్ రాజారాం పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మధునందన్ ఫ్రెండ్ రోల్ చేశాడు. ఈ మూడు పాత్రల మధ్యే మేజర్ సినిమా సాగుతుంది. ఇది రోడ్ జర్నీ మూవీ కాదు. కొన్ని సీన్స్ ఉంటాయి. సినిమా మేకింగ్ లో మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు. సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.

దర్శకుడు గురుపవన్ కథ ఎలా చెప్పాడో అంతే బాగా తెరకెక్కించాడు. చెప్పిన షెడ్యూల్స్ చెప్పినట్లు కంప్లీట్ చేశాడు. ఒక టీమ్ లా అంతా కష్టపడ్డాం. సినిమా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. త్వరలో ఉదయ్ తో మరో సినిమా చేస్తున్నాం. అలాగే నారా రోహిత్ హీరోగా ఓ చిత్రాన్ని, ఓ పెద్ద హీరోతో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ నెక్ట్ ఇయర్ సెట్స్ మీదకు వెళ్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed