ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. అపోలో లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 10.20 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్దన్ వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు.
మొదటి అమ్మాయి శ్వేత. తను చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్నారు. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. చిరంజీవితో బాపినీడు తెరకెక్కించిన సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’లో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్దన్ నటన అందరినీ అలరించింది. వందకు పైగా చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ సాగారు.
జనార్దన్ కు సినిమా అంటే ఎంతో మక్కువ. అందువల్ల ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించేవారు. ‘స్టూవార్ట్ పురం దొంగలు’ తో దాదాపు 100 వందు పైగా సినిమాలలో నటించారు జనార్థన్. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్దన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’లోనూ, నాగార్జునతో ‘వారసుడు’లోనూ, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీయస్’లోనూ అభినయించారు. సినిమాలలోనే కాకుండా ‘అన్వేషిత’ వంటి సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు జనార్థన్.