నటీనటులు – రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు

టెక్నికల్ టీమ్ – డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డీవోపీ : ఆర్ మదీ, నిర్మాత: అభిషేక్ అగర్వాల్, రచయిత, దర్శకత్వం: వంశీ

కథేంటంటే
1970, 80 దశకాల్లో ఆంధ్రప్రదేశ్ లోని స్టువర్టు పురం అంటే పోలీసులకు హడల్ ఉండేది. అక్కడ నాగేశ్వరరావు అనే గజదొంగ చేసే నేరాలు పోలీసులకు సవాల్ విసిరేవి. ఎంత భద్రత ఉన్నా, పోలీసులకు చెప్పి మరీ దొంగతనం చేసేవాడు నాగేశ్వరరావు. అతన్ని టైగర్ నాగేశ్వరరావు అని పిలుస్తారు. ఇతనిలో మరో కోణం ఉంది. అది దోచిన డబ్బుతో ఊరిని బాగుచేయడం. అందుకే స్థానికులకు టైగర్ నాగేశ్వరరావు ఒక హీరో. స్థానికంగా నేరాలు చేసే ఈ దొంగ..ఏకంగా దేశ ప్రధానికే బెదిరింపు లేఖ పంపిస్తాడు. దాంతో కేంద్రప్రభుత్వ స్థాయిలో ఇతని మీద విచారణ మొదలవుతుంది. టైగర్ నాగేశ్వరరావు ప్రధానిని బెదిరించే సాహసం ఎందుకు చేశాడు. టైగర్ నాగేశ్వరరావు నేపథ్య ఏంటి. ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయించగలిగిందా లేదా అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

స్టువర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని సినిమాటిక్ లిబర్టీస్ తో చేసిన చిత్రమిది. టైగర్ దొంగతనాలు, సాహసాలను వివరిస్తూ సినిమా మొదలవుతుంది. ఇక్కడ కేజీఎఫ్ లా సినిమాను నెరేట్ చేశారు. స్టార్టింగ్ లో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ ఆకట్టుకుని సినిమా మీద ఆసక్తి కలిగిస్తుంది. టైగర్ నాగేశ్వరరావును కరుడు గట్టిన దొంగగా చూపిస్తూ ఫస్టాఫ్ తెరకెక్కించిన దర్శకుడు..సెకండాఫ్ లో అతను ఎందుకు ఇలా దొంగతనాలు చేయాల్సివచ్చిందనేది వివరిస్తాడు. ఊరి ప్రజలకు అతను చేస్తున్న సాయం ఏంటనేది చూపిస్తాడు. బయోపిక్ అయినా ఫిక్షన్ కథైనా తెరపై ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేయాలి. కానీ కొత్త దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు సినిమాను ప్రేక్షకులను ఇంట్రెస్ట్ కలిగేలా తెరకెక్కించలేకపోయాడు. టైగర్ ను విలన్ గా చూపిస్తూ..చివరలో మంచోడు అని చెప్పే క్రమంలో డైరెక్టర్ విలువైన టైమ్ వృథా చేశాడు. ఇది విక్రమ్ ఫార్ములా అనుకోవాలి. ఆ సినిమాలో వర్కవుట్ అయ్యింది. ఆ టెంపో టైగర్ నాగేశ్వరరావులో కనిపించలేదు.

సారా (నుపూర్ సనన్) తో టైగర్ ప్రేమ కథ, పాటలతో కథ సైడ్ ట్రాక్ పట్టింది. ఇక సెకండాఫ్ లో అయితే నరుక్కుంటూ వెళ్లడమే. దాని వెనక ఎలాంటి ఎమోషన్ ఉండదు. ప్రేక్షకులకు కూడా ఈ సెన్స్ లెస్ యాక్షన్ తో విసుగొస్తుంది. కథలో , పాత్రల్లో సంఘర్షణ, ఎమోషన్ లేకుంటే సినిమాకు ఎన్ని భారీ హంగులు పెట్టినా ఉపయోగం ఉండదు. టైగర్ నాగేశ్వరరావు సినిమా పేరుకే బయోపిక్ గానీ స్టార్ హీరో సినిమాకు ఉండాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ విరివిగా వాడుకున్నారు. దాంతో ఒక బయోపిక్ కు కావాల్సిన ఒరిజినాలిటీ లోపించింది. మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ..వీళ్లంతా తమ పాత్రల మేరకు పర్ ఫార్మ్ చేశారు. సామాజిక కార్యకర్తగా ఈ కథకు కీలకమైన హేమలతా లవణం క్యారెక్టర్ ను సినిమాకు కావాల్సిన రేంజ్ లో మలచలేకపోయాడు దర్శకుడు. టెక్నికల్ గా సినిమా ఓకే. రవితేజ యాక్షన్, గెటప్, మేకోవర్ కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఈ ప్రయత్నం వృథాగానే మిగిలిపోయింది అనుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *