బాహుబలి మూవీతో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ నటుడు సత్యరాజ్. ఆయన కెరీర్ మొత్తం రాని గుర్తింపు ఈ ఒక్క క్యారెక్టర్ తో దక్కింది. తెలుగులో రెగ్యులర్ గా స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు సత్యరాజ్. ఆయన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో కీ రోల్ లో కనిపించబోతున్నారు సత్యరాజ్.

ఇవాళ సత్యరాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో కన్నీళ్లతో కోపంగా చూస్తున్న ఆయన స్టిల్ ఉంది. మాన్షన్ 24లో ఇంటిలోకి వెళ్లడమే గానీ బయటకు రావడం కుదరదు అంటూ ఈ సందర్భంగా క్యాప్షన్ రాశారు. దీంతో హాంటెడ్ హౌస్ నేపథ్యంతో సాగే వెబ్ సిరీస్ ఇదని తెలుస్తోంది. హాట్ స్టార్స్ స్పెషల్స్ గా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మాన్షన్ 24లో వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్, బిందు మాధవి, నందు, మానస్, అయ్యప్ప పి.శర్మ, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వెల్లడికానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *