‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచాయి. జూన్ 2న నేను స్టూడెంట్ సార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత ‘నాంది’ సతీష్ వర్మ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

నాంది తో మీ సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుని ‘నేను స్టూడెంట్ సర్’ ఎంత వరకు పెంచుతుంది. ?

‘నాంది’ అయినా ‘నేను స్టూడెంట్ సర్’ అయినా .. ఏదైనా ఓకే చేయడానికి కారణం కథలో వున్న మంచి కొత్త పాయింట్. నాంది సినిమాలో హీరో లీగల్ గా రివెంజ్ తీర్చుకోవడం అనేది కొత్త పాయింట్. నేను స్టూడెంట్ సర్ లో కూడా కొత్త పాయింట్ వుంది. మంచి థ్రిల్లర్ జోనర్ లో వెళుతుంది. బెల్లంకొండ గణేష్ ఈ కథకు చక్కగా సరిపోయారు. నేను స్టూడెంట్ సర్, నాందికి వచ్చిన క్రేజ్ ని నిలబెడుతుందని భావిస్తున్నాను.

కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? ఈ సినిమాకు కొత్త దర్శకుడు రాకేష్ గారిని ఎంచుకోవడానికి కారణం ?

కృష్ణ చైతన్య గారు ఓ అరగంట కథ చెప్పారు. కథ ఒక మొబైల్ ఫోన్ తో మొదలౌతుంది. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే అంశం. స్టూడెంట్స్ మంచి ఐఫోన్ కొనుక్కోవాలని చాలా తాపత్రయ పడతారు. ఇది ప్రతి కుటుంబంలో చూస్తాం. ఆ పాయింట్ బాగా నచ్చింది. అలాగే ఈ సినిమా ఐఫోన్ తో స్టార్ట్ అవుతుంది కానీ మంచి థ్రిల్లర్ గా వెళుతుంది. మూడు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లు వుంటాయి. ఆ ట్విస్ట్ లు నచ్చి కథ ఓకే చేశాను. కృష్ణ చైతన్య గారు నితిన్ సినిమాతో బిజీగా వుండటం కారణంగా దర్శకత్వం చేయడం కుదరలేదు. కథ మాత్రం ఇచ్చారు. రాకేష్ ఇదివరకు నాకు ఒక కథ చెప్పారు. కానీ అది నేను చేసే జోనర్ కాదు. అలాగే ఓ వెబ్ సిరీస్ కి ఒక ఎపిసోడ్ షూట్ చేసుకొని చూపించారు. మేకింగ్ చాలా బాగుంది. ఇది కథని రాకేష్ బాగా తీస్తాడనిపించింది. మరో ప్రధాన అంశం ఏమిటంటే ఒక పెద్ద దర్శకుడి దగ్గర నాలుగు సినిమాలకి సహాయకుడిగా పని చేస్తే సినిమాపై పూర్తి పట్టు వస్తుందని నమ్ముతాను. మంచి కథ ఇస్తే బాగా చేస్తారనే నమ్మకం. నాందికి అలాగే ఫ్రూవ్ అయ్యింది. ‘నేను స్టూడెంట్ సర్’ చూసినప్పుడు కూడా రాకేష్ చాలా బాగా తీశాడనిపించింది.

‘నేను స్టూడెంట్ సర్’ అని టైటిల్ పెట్టారు.. స్టూడెంట్స్ కి సందేశం ఇస్తున్నారా ?

సందేశం అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. యూనీవర్సిటీలో స్టూడెంట్ లైఫ్ ని చూపించాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురౌతాయా ? ఆ ఇబ్బందులు ఎక్కడి వరకూ తీసుకెళతాయి ? అలాగే మనం పేపర్ లో చదివే ఓ రెండు సంఘటనలు ఇందులో ఉంటాయి. వాటిని మనం ఎప్పుడూ పట్టించుకోము. కానీ ఈ స్టూడెంట్ ద్వారా అది రివిల్ అవుతుంది. ఈ సంఘటన ఏమిటనేది సినిమా చూసినప్పుడు చాలా ఆసక్తికరంగా వుంటుంది.

భాగ్యశ్రీ గారి అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు కదా.. ?

భాగ్యశ్రీ గారు హిందీ ఛత్రపతిలో చేశారు. అదే సమయంలో వాళ్ళ అమ్మాయిని సౌత్ లో లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా సంప్రదించడం జరిగింది. అవంతిక ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేసింది. ఈ చిత్రంలో తన పాత్రని చాలా చక్కగా చేసింది.

మహతి స్వర సాగర్ మ్యూజిక్ గురించి?

ఇందులో చాలా బ్యూటీఫుల్ సాంగ్స్ వుంటాయి. బీజీయం నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. సినిమా చూసిన తర్వాత కేవలం బీజీయం కోసమే ఒక స్పెషల్ పార్టీ చేసుకున్నాం( నవ్వుతూ). చాలా ఎక్సైటింగ్ గా వుంటుంది. ఇందులో అనవసరమైన పాటలు, ఫైట్లు వుండవు. సెకండ్ హాఫ్ లో అసలు పాటలే వుండవు. మంచి థ్రిల్లర్ చూసిన అనుభూతి వుంటుంది.

నాందికి మంచి పేరు వచ్చింది కదా.. బిజినెస్ పరంగా స్టాండ్ అయ్యిందా ?

నాంది వెలకట్టలేని పేరు తీసుకొచ్చింది. ఒక గౌరవం తీసుకొచ్చింది. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది.

నాంది తర్వాత మీ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు వుంటాయి? వాటిని ‘నేను స్టూడెంట్ సర్’ అందుకుంటుందా ?

నేను సాధారణంగా రెండు సార్లు చూసిన సినిమాలు చాలా తక్కువ. బాహుబలి, హ్యాపీ డేస్ , కొత్తబంగారులోకం లాంటి కొన్ని సినిమాలు తప్పితే చాలా వరకూ రెండోసారి చూడను. ‘నేను స్టూడెంట్ సర్’ మాత్రం ఇప్పటి వరకూ నాలుగు సార్లు చూశాను. ఎక్కడా బోర్ కొట్టదు. ఖచితంగా రీచ్ అవుతుంది. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. నాంది మంచి సినిమా కోవిడ్ కారణంగా 40 ఏళ్లకు పైబడిన వారు ఎక్కువగా థియేటర్ కి వచ్చి చూడలేదు. ‘నేను స్టూడెంట్ సర్’ మాత్రం అన్ని ఏజ్ గ్రూపుల వారు థియేటర్ కి వచ్చి సినిమా చూస్తారు.

గణేష్ ఈ పాత్రని ఎలా చేశాడు ?

గణేష్ బయట ఎలా ఉంటారో ఈ పాత్ర దాదాపు అలానే వుంటుంది. అమాయకత్వం, స్వచ్చమైన నవ్వు.. చాలా సహజంగా కనిపిస్తాడు. ఈ పాత్రకు సరిగ్గా పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పాత్రలో జీవించేశాడు.

సముద్రఖని ఎంపిక మీ ఛాయిస్ అని విన్నాం ?

నాకు కాస్టింగ్ అంటే మొదటి నుంచి ఆసక్తి. నాందిలో వరలక్ష్మీ శరత్ కుమార్ ని తీసుకోవడానికి కారణం అదే. బడ్జెట్ ఎక్కువైనా సరే వరలక్ష్మీ లాంటి నటి ఉంటేనే కథకు న్యాయం జరుగుతుంది. నాంది సెకండ్ హాఫ్ నిలబడటానికి కారణం అదే. ఇందులో పాత్రకు సముద్రఖని గారు ఐతే బావుంటుదనిపించింది. ఆయన శంభో శివ శంభో చిత్రాన్ని సురేష్ గారే నిర్మించారు. సురేష్ గారి అబ్బాయి సినిమా తప్పకుండా చేస్తానని చేశారు. కథ కూడా ఆయనకి చాలా నచ్చింది. ఆయన పాత్ర చూసుకున్నపుడు చాలా హ్యాపీ గా అనిపించింది.

నాంది కి నేషనల్ అవార్డ్స్ లో అప్లై చేశారా ?

చేశాం. ఏదో కేటగిరీలో అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇంతకుముందు సైమా, సాక్షి ఎక్స్ లెన్స్, దాదాసాహెబ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి.

కొత్త కథలు రెడీ చేసుకున్నారా?

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఓ కథ రెడీ చేశాం. అది ఆయనకి చాలా నచ్చింది. భాగ్ మిల్ఖా భాగ్ తరహాలో ఫిక్షనల్ బయోపిక్. దీనికి రాకేష్ దర్సకత్వం వహిస్తారు. నాకు థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్ టైనర్స్ ఇష్టం.

నాంది సీక్వెల్ ఉంటుందా ?

చేస్తాం. కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను.

చిన్న సినిమాకి మార్కెట్ ఎలా వుంది ?

ఏదైనా కథ నచ్చి చేయడమే. నాంది కూడా కథ నచ్చి చేసిందే. ఇది కూడా అంతే. ఎలాంటి లెక్కలు వేసుకోలేదు. కథ బావుంటే వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకం తో చేశాం.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *