అల్లరి నరేష్.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దివంగ‌త‌ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్.. తన తొలి సినిమా `అల్లరి‌`నే ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేష్ గా ప్రసిద్ధి పొందాడు. కామెడీ చిత్రాలతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచిన అల్లరి నరేష్.. కెరీర్ లో వేగంగా 50 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. అయితే ఒకానొక ద‌శ‌లో కామెడీ చిత్రాలకు ఆదరణ లేకుండా పోయింది. దాంతో అల్లరి నరేష్ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

ఇక కామెడీ చిత్రాలను నమ్ముకుని లాభం లేదని భావించిన అల్లరి నరేష్.. రూటు మార్చి ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అలా అల్లరి నరేష్ నుంచి వచ్చిన చిత్రమే `నాంది`. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా అల్లరి నరేష్ తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు. తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ అనంతరం రీసెంట్గా ఈయన `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం` మూవీతో వచ్చాడు.

ఏ.ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. నవంబర్ 25న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ‌స్తోంది. అల్లరి నరేష్ తనదైన పర్ఫామెన్స్ తో మరోసారి అదరగొట్టాడంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో విశేషాల‌ను పంచుకున్నాడు. అలాగే తాను హీరో అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదంటూ అల్లరి నరేష్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సైతం బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు పెద్ద టాలెంట్ లేకపోయినా సినిమాలంటే మహా ప్రాణమని, కానీ హీరో అవ్వాలని మాత్రం ఏనాడు అనుకోలేదని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు.

ఎందుకంటే తాను హీరో మెటీరియల్ కాదని, బక్కగా పీలగా ఉంటానని, తన ఫేస్ కట్ కూడా హీరో ఫేస్ కట్ కాదని అల్లరి నరేష్ నమ్మేవారట. చిన్నప్పటి నుంచి విలన్ కావాలని ఆయన అనుకునేవారట. ఈ విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా తెలిపారు. చిన్నతనంలో వచ్చిన భాషా సినిమా చూసిన తర్వాత ఖ‌చ్చితంగా విలన్ అవ్వాలని అల్ల‌రి న‌రేష్ ఫిక్స్ అయ్యార‌ట‌. ఈ సినిమాలో విలన్ గా నటించిన రఘువరన్ అచ్చం చూడడానికి తనలానే సన్నగా ఉంటార‌ని, అయినా సరే రజనీకాంత్ కు విలన్ గా చేశారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు, అందుకే తాను కూడా విలన్ అవుదామని కలలు కనేవాడిన‌ని అల్ల‌రి న‌రేష్ చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా అల్లరి సినిమాతో హీరోగా మారాల్సి వ‌చ్చిందంటూ వివ‌రించారు. దీంతో ఈయన కామెంట్ కాస్త వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *