టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ల లిస్ట్‌ తీస్తే మొదట ఉండేది దిల్ రాజు పేరే. దిల్ రాజు అస‌లు పేరు వి.వెంకట రమణా రెడ్డి. ఆయ‌న్ను ఇంట్లో రాజు అని పిలిచేవారు. నిర్మాత‌గా ఈయ‌న చేసిన తొలి సినిమా `దిల్‌` కావ‌డంతో.. ఆయ‌న పేరు దిల్ రాజుగా మారింది. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత నిర్మాతగా మారి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు.

తన బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి బడా నిర్మాతగా, చిత్ర పరిశ్రమను శాసించే రారాజుగా పేరొందారు. ఏ హీరో సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలి.. ఎన్ని థియేటర్లు ఇవ్వాలి అనేది నిర్ణయించేది కూడా దిల్ రాజే అని అంటుంటారు. ఈ విషయంలో ఎప్పటినుంచో దిల్ రాజు పై తీవ్ర వ్యతిరేకత నడుస్తోంది. ఇక గ‌త‌ కొద్ది రోజుల నుండి `వారసుడు` సినిమా కారణంగా దిల్ రాజు పేరు వార్తల్లో మారుమోగిపోతుంది. సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాల‌కు ప్రాధాన్యత ఇవ్వకూడదని తెలుగు నిర్మాతలందరూ కలిసి దిల్ రాజు నిర్మించిన త‌మిళ సినిమా `వారసుడు`ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం విధితమే.

ఈ విషయంపై ఇప్పటి వరకు నేరుగా స్పందించని దిల్ రాజు.. ఎట్టకేలకు నోరు విప్పారు. తాజాగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయ‌న ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారసుడు విషయంలో కావాలనే కొందరు వివాదం చేస్తున్నార‌ని, అది చేస్తుంది ఎవరో కూడా త‌న‌కు తెలుసు, అయితే తాను ఎవరిని పాయింట్ చేసి మాట్లాడను అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. పేరుకే సినిమా వాళ్ళంతా ఒక కుటుంబం.. వాస్తవంలో ఎవరు నిర్ణయాలు వారవే, ఎవరి దారులు వారివే అందరూ కలిసి ఉండటం జరగని పని అంటూ దిల్ రాజు కుండబద్దలు కొట్టేశారు.

ఈ క్ర‌మంలోనే ` ఒకప్పుడు హిందీ హీరోలకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు తెలుగు హీరోలకి కూడా 100 కోట్లు ఇచ్చే పరిస్థితి వచ్చేసిందిగా..` అని ప్రశ్నించగా.. అందుకు దిల్ రాజు స్టార్ హీరోలు 100 కోట్లు తీసుకుంటున్నారంటే తప్పులేదు. ఇచ్చే వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పేముంది అంటూ తేల్చేశారు. ఇక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ కు సినిమా చూపించరు, కేవలం ఒక అంచనాతోనే కొనాలి, అందుకే నిర్మాతగా మారానంటూ దిల్ రాజు పేర్కొన్నారు. ఇక నిర్మాత‌గా త‌న 20 ఏళ్ల కెరీర్ లో నేమ్ ఫేమ్ త‌ప్ప ఇంకేం మిగ‌ల్లేద‌ని దిల్ రాజు ఓపెన్ కామెంట్స్ చేశారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *