దివంగత దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ తనయుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్.. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించాడు. అలాగే గమ్యం, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించి ప్రేక్షకుల‌ను మెప్పించ‌డ‌మే కాదు విమర్శకుల నుంచి ప్రశంసలను సైతం అందుకున్నాడు.

దాదాపు ఇర‌వై ఏళ్ల సినీ కెరీర్ లో ఇర‌వైకి పైగా చిత్రాలు చేసిన అల్లరి నరేష్ ను ఒకానొక ద‌శ‌లో వరుస ప్లాపులు వెంటాడాయి. దాంతో కామెడీ చిత్రాలకు పులిస్టాప్ పెట్టి ప్రయోగాత్మక కథలపై దృష్టి సారించాడు. అలా చేసిన చిత్రమే `నాంది`. 2021లో విడుదలైన‌ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. నటన పరంగా అల్లరి నరేష్ ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ తో అల్ల‌రి న‌రేష్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు.

ఇక ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ `ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం` అనే సినిమాలో నటించాడు. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. జీ స్టూడీయోస్‌, హస్య మూవీస్ బ్యాన‌ర్ల‌పై రాజేష్ దండు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వ‌హిస్తూ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు విశ్వక్ సేన్, శ్రీవిష్ణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే ఈ ఈవెంట్ లో అల్లరి నరేష్ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. సినిమా మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ క్ర‌మంలోనే అల్ల‌రి న‌రేష్ మాట్లాడుతూ.. నాన్న కాలం చేశాక నా కెరీర్ చూసి నాన్నగారు ఉంటే బాగుండేదని చాలా మంది అన్నారు. అలాంటి కామెంట్స్ కొన్ని న‌న్ను ఎంతగానో బాధపెట్టాయి` అంటూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యాడు. అయితే సినిమాలు అన్నాక ఒక్కోసారి ఊహించిన దాని కన్నా ఎక్కువ రిజల్ట్ అందుకుంటాయి.. ఒక్కోసారి అంచనాలను అందుకోలేక‌ బోల్తా కొడతాయి. హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. రెండిటినీ సమానంగా చూడాలి. అప్పుడే ముందుకు వెళ్ల‌గ‌లుగుతారు అంటూ అల్ల‌రి న‌రేష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *