ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు తెరకు నాటక రంగం నుంచి వచ్చిన ఆర్టిస్టులలో ఈమె కూడా ఒకరు. అయితే ” పావలా” అనే నాటిక ఈమెకు మంచి పేరు తీసుకురావడంతో అదే ఇంటిపేరుగా మార్చుకుంది. ఆ తర్వాత ఈమె టీవీ సీరియల్స్, సినిమాల్లో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్యామలకు ఏ పాత్ర ఇచ్చినా సరే తనదైన మార్క్ స్పష్టంగా చూపించిందని చెప్పాలి. పాత్ర ఏదైనా తనదైన విరుపులు, వెటకారాలు చూపించడం ఆమె ప్రత్యేకత..

అలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామలకు ఈమధ్య అవకాశాలు రావడం లేదు. అందుకు కారణం ఆమెకు వయసు పైబడడమే.. అయితే ఆమె కూతురు అనారోగ్యం బారిన పడటంతో ఆమె మరింత ఇబ్బందులను ఎదుర్కొంటుంది . తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శ్యామల.. ఆమె మాట్లాడుతూ.. “ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు మాత్రమే నాకు సహాయం చేశారు. నాకు మా లో సభ్యత్వాన్ని ఇప్పించి ప్రతి నెల కొంత మొత్తం వచ్చేలా చేశారు. ఆయన చేసిన సహాయాన్ని నేను మర్చిపోలేను.

మరొకవైపు మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ , ప్రభాస్ వీరంతా కూడా తలా రూ.10లక్షలు నాకు సహాయం చేసినట్టుగా నేను హాయిగా ఉన్నట్టుగా ఎవరో తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. అవన్నీ పుకార్లు మాత్రమే.. ఏ ఒక్క హీరో కూడా నాకు కనీసం లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు.. అలాంటి పుకార్ల వల్ల నాకు చిన్న చిన్న సహాయాలు చేసేవారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. నాకు ఎలాంటి సహాయం కూడా దక్కకూడదని ఉద్దేశంతో ఒక మహాతల్లి ఇలా చేసింది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది శ్యామల.

మరొకవైపు టాలీవుడ్ హీరోలపై అసహనం వ్యక్తం చేస్తోంది. ఇంతవరకు ఇండస్ట్రీకి సేవ చేసినందుకుగాను చివరి క్షణాల్లో ఎవరు తనకు సపోర్టుగా నిలవడం లేదని, కనీసం తినడానికి కూడా సహాయం చేయటం లేదు అంటూ వాపోయింది శ్యామల. ఏదేమైనా ఇండస్ట్రీలో ఉన్నతంగా బ్రతికిన ఈమె ఈరోజు ఇలా తిండి కోసం అడుక్కోవడం చూసి మరి కొంతమంది కంటతడి పెట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *