సినీ పరిశ్రమలో వారసత్వ రాజ్యం గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సినీ తారల్లో సగానికి పైగా మంది వారసత్వం ద్వారా వచ్చిన వారే. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ ఎందరో నటీనటులు వారసత్వం ద్వారా కెమెరా ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ త‌నయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి.

అప్పుడు ఇప్పుడు అంటున్నారే తప్ప మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం మాత్రం జరగడం లేదు. మరోవైపున నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని తహతహలాడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య త‌న‌యుడి ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ రానుందని, ఆ సినిమాతోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని వెల్లడించారు.

పైగా ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్‌ రాలేదు. ఇక `అఖండ` విడుదల తర్వాత మోక్షజ్ఞ డ‌బ్యూ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే ఉంటుందని వార్తలు పుట్టుకొచ్చాయి. అదీ జరగలేదు. అయితే ఇన్సైడ్ టాక్‌ ప్రకారం.. బాల‌య్య తనయుడి కోసం ఓ మంచి కథను వెతుకుతున్నార‌ట‌. అందుకోసం ఆయన తన కూతురు తేజస్విని సాయాన్ని కూడా కోరారట.

ప్రస్తుతం తండ్రి-కూతురు కలిసి మోక్షజ్ఞ డబ్యూ కోసం ఓ అదిరిపోయే కథను ఎంపిక చేసే పనిలో పడ్డారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా, బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ఈయన గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్న `వీర సింహారెడ్డి` వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన 108వ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక మ‌రోవైపు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ‌ ఆహా వేదికగా `అన్ స్టాప‌బుల్` సీజ‌న్ కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకుల‌ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *