ఐపీఎల్ మళ్లీ అప్పుడు మొదలవుతుందట.. హింట్ ఇచ్చిన గంగూలీ…?

ఐపీఎల్ 2021 ఎన్నో విపత్కర పరిస్థితుల మధ్య నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఐపీఎల్ 2021 సీజన్ కు బ్రేకులు పడ్డాయ్. మధ్యలోనే అర్ధాంతరంగా ఐపీఎల్ 14 వ సీజన్ కథ ముగిసింది. ఇక, ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా కమ్మేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే 9 మందికి కరోనా సోకడంతో ఐపీఎల్‌ను రద్దు చేయకతప్పలేదు. అయితే నిన్నటి వరకూ కచ్చితంగా జరిపి తీరుతామని పేర్కొన్న బీసీసీఐ ఎట్టకేలకు దిగివచ్చింది. క్రికెటర్లకు ఏమైనా అయితే అది మరింత తలనొప్పిగా మారే ప్రమాదం ఉండటంతో టోర్నీని వాయిదా వేసింది. ఐపీఎల్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి అయోమయంలో పడింది.అయితే ఐపీఎల్ ను మళ్లీ ఎప్పుడు జరుపుతామన్న విషయం క్లారిటీ ఇవ్వలేదు. ఐపీఎల్ మళ్లీ ఎప్పుడు కొనసాగించే అవకాశం ఉందో బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హింట్ ఇచ్చాడు..

ఈ సంవత్సరం చివర్లో భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్‌లో మిగతా మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రయత్నిస్తామని గంగూలీ వెల్లడించాడు. కానీ అప్పుడు మ్యాచ్‌లు నిర్వహించడం అనుకున్నంత తేలిక కాదు.టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు మధ్యలో మొదలు కావాల్సి ఉంది. అయితే సెప్టెంబరు 14 వరకు భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆడాల్సి ఉంది. అంటే మధ్యలో నెల రోజుల ఖాళీ ఉంటుంది. కానీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చినా, లేదా మరో చోట టోర్నీ జరిగినా కరోనా భయం ఉంటుంది కాబట్టి రెండు వారాల ముందే ఆటగాళ్లు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది.

అయితే భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన వెంటనే ఐపీఎల్ ఆడలేరు. దీని తర్వాత వీరికి కొంచెం విరామం కావాలి. కాబట్టి గంగూలీ చెబుతున్నట్లు టీ20 ప్రపంచకప్‌కు ముందు అన్ని దేశాల ఆటగాళ్లను ఒక చోటికి చేర్చి ఐపీఎల్‌లో మిగతా 31 మ్యాచ్‌లను పూర్తి చేయడం అంత తేలిక కాదు. ఇక నవంబరు నెలాఖర్లో టీ20 ప్రపంచకప్ అయ్యాక ఐపీఎల్‌ను మళ్ళీ ప్రారంభించే వీలుంది కానీ  అప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు యాషెస్ సిరీస్. ఆ రెండు దేశాల స్టార్లు లేకుండా ఐపీఎల్ ఆడిస్తే టోర్నీ కళ తప్పవచ్చు. అయినా కూడా పర్వాలేదు అనుకుంటే అప్పుడు లీగ్ ను జరిపించడానికి అవకాశం ఉంటుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *